మార్మోగుతున్న కావలి నియోజకవర్గం ముసునూరు

నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో వున్న కృష్ణపట్నం లో ఆనందయ్య మందుకు క్రేజ్ – అదేవిధంగా జిల్లాలో కావలి నియోజకవర్గంలోని ముసునూరు లోనూ ఆనందయ్య లాంటి వ్యక్తి మందు తయారు మొదలు పెట్టారు.. ఇక్కడ పెరుగుతున్న జనం రద్దీని చూస్తుంటే – ముసునూరు గ్రామం కూడా త్వరలో మరో కృష్ణపట్నంగా మారబోతుందనిపిస్తుంది .

సహజంగా ఏ ఫార్మా కంపెనీ అయినా కనిపెట్టిన మందుకు సంబంధించిన ఫార్ములా గోప్యంగా వుంచడం జరుగుతుంది . కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసిన సాంప్రదాయ మందు (కరోన నివారణ మందు) ఫార్ములాను మాత్రం విచారణకు నియమించిన జిల్లా అధికారుల కమిటీ బట్టబయలు చేసింది . దాంతో ఆనందయ్య తన మందులో ఏమేమి వాడుతాడన్నది ప్రపంచానికి తెలిసిపోయింది . ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ ఆనందయ్య మందుకు ఆయుర్వేద మందు అన్న గుర్తింపును ఇవ్వకపోయినా – ఆనందయ్య మందు ఎలాంటి దుష్ప్రభావాలు చూపదని సర్టిఫికెట్ మాత్రం ఇచ్చింది . ఆ ప్రకటన వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆనందయ్య లు తయారై ఈ మందు తయారుచేసేందుకు ఉపక్రమించారు . ఈ ఫార్ములా టైప్ మందునే తయారుచేయడానికి పూనుకున్నారు . కేంద్రప్రభుత్వం కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజల్ని కాపాడే ప్రక్రియలో భాగమైన టీకాల పంపిణీ కార్యక్రమం బాగా జాప్యం అవుతుండడంతో – వేలాది మంది ప్రజలు ఆనందయ్య లాంటి వారు తయారుచేసే మందు వేసుకొని ఉపశమనం పొందేందుకు ఎగబడుతున్నారు .

ఇదిలావుంటే ఆనందయ్య మందు ఇక ప్రత్యక్షంగా కృష్ణపట్నం లో దొరికే పరిస్థితి లేకుండా పోయింది . సామాన్యులకు ఆనందయ్య మందు ఇప్పుడు అందని ద్రాక్ష సామెత అయ్యింది . కృష్ణపట్నంలో 144 సెక్షన్ అమలులో వుంది . ఆనందయ్య కూడా అందుబాటులో లేకుండా పోయాడు . దేవుడి దర్శనం అయినా దొరుకుతుంది గానీ – ఆనందయ్య దర్శనం మాత్రం దొరికే పరిస్థితి లేదు . ఆయన చుట్టూ 10 మంది ఏఆర్ కానిస్టేబుళ్లను బందోబస్తుగా ప్రభుత్వం ఏర్పాటుచేసింది . కృష్ణపట్నం పోర్టు లో ఇప్పుడు ఆనందయ్య మందు తయారవుతుందని ప్రచారం జరుగుతోంది . ఆ మందు తయారీ అంతా పూర్తిగా నాయకుల కనుసన్నల్లోనే జరుగుతుందనే వాదన వినిపిస్తోంది . ఈ మందు తయారీ కాస్తా డబ్బున్నవారు,పలుకుబడీ దారులు, విరాళాలు అందచేసే వారికి, ట్రస్ట్ కు సహాయ సహకారాలు అందిచే వారికి మాత్రమే అందుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల చంద్రగిరి , సర్వేపల్లి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు తమ నియోజకవర్గాల పరిధిలో కొందరికి ఆనందయ్య తయారుచేసిన మందు పంపిణీ చేయడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనం . ప్రస్తుతం ఆనందయ్య గాని , ఆనందయ్య మందుగాని సాధారణ ప్రజలకు అందుబాటులో లేదు . దీంతో ఇప్పుడు ప్రజలు ఆనందయ్య మందు లాంటి మందు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొని తమ ప్రాణాలు కాపాడుకొనేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు .

కావలి నియోజకవర్గం ముసునూరులో సాంప్రదాయ మందు తయారీ.. ఉచిత పంపిణీ….

కావలి నియోజకవర్గ పరిధిలో వున్న ముసునూరు గ్రామంలోని ఒక తోటలో ఆనందయ్య మందు తరహాలోనే సాంప్రదాయ (నాటు) మందును జెట్టి భాస్కరరెడ్డి తయారుచేసి ప్రజలకు ఉచితంగా పంపిణీచేస్తున్నాడు . కొద్ది రోజుల క్రితమే అక్కడ ఈ మందు తయారీ ప్రారంభం అయినా – ఈ తయారీవిషయం ఆనోటా ఈనోటాపడి పొరుగు రాష్ట్రాలకు కూడా ఎగబాకడంతో జనం రద్దీ పెరిగిపోయింది . తయారీదారుడు భాస్కరరెడ్డి మాట్లాడుతూ.. . తాను తయారుచేసే మందు మనిషిలో ఇమ్యూనిటీని పెంచుతుందన్నారు . కరోన సోకిన వారు తన మందు వాడితే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని , తద్వారా కరోన వైరస్ అరికట్టబడుతుందన్నారు .ఆనందయ్య మందు తరహాలోనే వన మూలికలు , ఆకులు , తయారీకి వాడే ముడి పదార్ధాలు అక్కడ గుట్టలుగుట్టలుగా కనిపించాయి . మందు తయారుచేసేది తానేనని భాస్కరరెడ్డి తెలిపాడు . ఎవరైనా దాతల ప్రోత్సాహంతో తయారుచేసున్నారా ? అని ప్రశ్నిస్తే … అలాంటిదేమీ లేదన్నాడు . తన స్వంత డబ్బుతోనే మందు తయారుచేసి ఉచితంగా ప్రజలకు పంపిణీ చేస్తున్నానన్నాడు . జెట్టి శేషారెడ్డి కొద్ది రోజులు కృష్ణపట్నంలో వుండి అక్కడ ఆనందయ్య మందు తయారుచేసేవిధానాన్ని తెలుసుకొని వచ్చినట్లు తెలుస్తోంది .

ఏది ఏమైనా ఈ కరోన క్లిష్టసమయంలో ప్రాణాలకు ప్రమాదం లేని నాటు మందు తయారుచేస్తున్న ఆనందయ్య , షమీ , జెట్టి శేషారెడ్డి లాంటి నాటు మందు తయారీదార్లను ప్రభుత్వం ప్రోత్సహించాలి . కార్పొరేట్ వైద్యశాలల్లో లక్షలు చెల్లించుకోలేక విలవిలలాడుతున్న జనంలో ఆనందయ్య మందు ఒక నమ్మకాన్ని ఆవిష్కరించింది . కాబట్టి ప్రస్తుత పరిస్థితిలో ప్రజాభిష్టం మేరకు అధికారులు కూడా సామాన్య ప్రజలకోసం – నాటుమందు తయారుచేసి ఉచితంగా పంపిణీ చేస్తున్న ఇలాంటి నాటు వైద్యులను ప్రొత్సహిస్తు తగు సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది