సెప్టెంబర్ 18నుండి పునఃప్రారంభం కానున్న ఐపిఎల్.

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్ప‌టికే 29 మ్యాచ్‌లు ముగియ‌గా కరోనా కారణాన మ‌రో 31 జ‌ర‌గాల్సి వుండగానే లీగ్ నిరవధికంగా వాయిదా పడింది. మలిదశ మ్యాచ్లను సెప్టెంబ‌ర్ 18 నుంచి యూఏఈలో నిర్వ‌హించే ఆలోచనలో ఉన్న‌ట్లు బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా వెల్ల‌డించారు. మ‌రో రెండు రోజుల్లో బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ, సెక్ర‌ట‌రీ జే షా, ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేష్ ప‌టేల్ కూడా యూఏఈ రానున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా రాజీవ్ శుక్లా వెల్ల‌డించారు. అక్క‌డి ప్ర‌ముఖ ప‌త్రిక ఖ‌లీజ్ టైమ్స్‌తో ఆయ‌న మాట్లాడారు. తాము ఇక్క‌డి క్రికెట్ బోర్డుతో చర్చ‌లు జ‌ర‌ప‌నున్నామ‌ని, ఆ త‌ర్వాత షెడ్యూల్ త‌యారు చేస్తామ‌ని శుక్లా చెప్పారు. గ‌తేడాది ఇక్క‌డ జ‌రిగిన‌ట్లే ఈసారి కూడా టోర్నీ స‌జావుగా సాగేలా ఏర్పాట్లు చేస్తామ‌ని తెలిపారు. ఇక స్టేడియాల్లో అభిమానుల‌కు అనుమ‌తి ఇస్తారా లేదా అన్న ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు చేతుల్లో ఉన్న‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అభిమానుల‌ను స్టేడియాల‌కు అనుమ‌తించినా, లేక‌పోయినా తమ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని శుక్లా స్ప‌ష్టం చేశారు. ఇండ్లండ్‌లో టెస్ట్ సిరీస్ ముగిసిన నాలుగు రోజుల త‌ర్వాత అంటే సెప్టెంబ‌ర్ 18న ఐపీఎల్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాల ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.