వ్యాక్సినేషన్‌లో భారత్‌ రికార్డు.. ప్రపంచంలోనే అత్యధికంగా టీకాల పంపిణీ

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భారత్‌ సరి కొత్త రికార్డు సృష్టించింది. కనీసం ఒక డోసు టీకా తీసుకున్నవారు, వ్యాక్సినేషన్‌ పూర్తిచేసుకున్న వారి సంఖ్య ప్రపంచంలోనే దేశంలో అత్యధికమని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈమేరకు వెబ్‌సైట్‌లో ఈ శాఖ కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌పై ఈ-పుస్తకాన్ని మంగళవారం ఉంచింది.

దేశంలో సెప్టెంబరు వరకు పురుషులకు 52.5%, మహిళలకు 47.5%, ఇతరులకు 0.02% డోసులు వేశారు. మొత్తం డోసుల్లో 62.54% గ్రామీణ ప్రాంతాల్లో వేసినట్లు పేర్కొంది.

60.7% మంది వయోజనులు కనీసం ఒక డోసు టీకా తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా 2,44,310 టీకా కేంద్రాలు పనిచేస్తుండగా.. 18.1 కోట్ల మంది రెండుడోసులూ తీసుకున్నా రు. అమెరికాలో ఇలాంటి వారి సంఖ్య 17.8 కోట్లు.

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లంతా (100%) తొలి డోసు తీసుకోగా.. 81.1 శాతం మంది పూర్తిగా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఆరోగ్య సిబ్బందిలో 98.8% మంది తొలి డోసు పొందగా.. 84.7% మంది రెండో డోసు కూడా తీసుకున్నారు.

రాష్ట్రాలకు 72.77 కోట్ల డోసులు..

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ‘నేరుగా సేకరణ కేటగిరీ’ కింద ఇంతవరకు 72.77 కోట్లకు పైగా కొవిడ్‌ టీకా డోసులు ఉచితంగా అందించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది.

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 17న భారీ ఎత్తున కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు 32.90 లక్షల మందికి టీకాలు వేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈనెల 26 నాటికి రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ వేసేందుకు కూడా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.