బైడెన్ టీంలో భారతీయ అమెరికన్లకే ప్రాధాన్యత.. 20మందికి కీలక పదవులు..

అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన జో బైడెన్ రెండు రోజుల్లో అధికారిక బాధ్యతలు స్వీకరించనున్నారు. బైడెన్ టీంలో ఊహించని విధంగా భారతీయ అమెరికన్లకు ప్రాధాన్యత లభిస్తోంది. ఇప్పటికే దాదాపుగా 20 మంది ఇండో అమెరికన్లను బైడెన్ అనేక కీలక పదవుల్లో నియమించారు. అందునా 13 మంది మహిళలకు అవకాశం ఇచ్చారు. ఇక, శ్వేత సౌధం నుండి బాధ్యతలు నిర్వహించే శక్తిమంతమైన బైడెన్‌ పాలన బృందంలో 17 మంది భారతీయ అమెరికన్లు కీలకంగా వ్యవహరించనున్నారు. వారిలో మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ డైరెక్టర్‌గా నామినేట్‌ అయిన నీరా టాండన్‌ ఒకరు. బైడెన్‌ డిప్యూటీగా ఉపాధ్యక్ష పదవికి ఆఫ్రో–ఇండియన్‌ మూలాలున్న కమలా హ్యారిస్‌ ఇప్పటికే ఎన్నికయ్యారు. ఈ నెల 20న అధ్యక్షుడిగా బైడెన్.. ఉపాధ్యక్షురాలిగా కమల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బైడెన్‌ టీంలో యూఎస్‌ సర్జన్‌ జనరల్‌గా ఎంపికైన వివేక్‌ మూర్తి, న్యాయ విభాగంలో అసోసియేట్‌ అటార్నీ జనరల్‌గా ఎంపికైన వనిత గుప్తా, సివిలియన్‌ సెక్యూరిటీ, డెమొక్రసీ, హ్యూమన్‌రైట్స్‌కు అండర్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌గా ఎంపికైన ఉజ్రా జెయా, బైడెన్‌ భార్య, కాబోయే ఫస్ట్‌ లేడీ డాక్టర్‌ జిల్‌ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా ఎంపికైన మాలా అడిగ, జిల్‌ బైడెన్‌ డిజిటల్‌ డైరెక్టర్‌గా ఎంపికైన గరీమా వర్మ, వైట్‌ హౌజ్‌ డెప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా ఎంపికైన సబ్రీనా సింగ్, వైట్‌హౌజ్‌ నేషనల్‌ ఎకనమిక్‌ కౌన్సిల్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎంపికైన భరత్‌ రామమూర్తి, వైట్‌హౌజ్‌ ప్రెసిడెన్షియల్‌ పర్సనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎంపికైన గౌతమ్‌ రాఘవన్‌ లకు బైడెన్ కీలక బాధ్యతలు అప్పగించారు.

కశ్మీరీ మూలాలున్న అయిషా షా వైట్‌హౌజ్‌ ఆఫీస్‌ ఆఫ్‌ డిజిటల్‌ స్ట్రాటెజీలో పార్ట్‌నర్‌షిప్‌ మేనేజర్‌గా, సమీరా ఫజిలి వైట్‌హౌజ్‌లోని యూఎస్‌ నేషనల్‌ ఎకనమిక్‌ కౌన్సిల్‌లో డెప్యూటీ డైరెక్టర్‌గా ఎంపిక అయ్యారు. మరోవైపు, జో బైడెన్‌ సన్నిహిత బృందంలో ఒకరైన వినయ్‌ రెడ్డి డైరెక్టర్, స్పీచ్‌ రైటింగ్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అసిస్టెంట్‌ ప్రెస్‌ సెక్రటరీ టు ద ప్రెసిడెంట్‌గా యువకుడైన వేదాంత్‌ పటేల్‌ను ఎంపిక చేశారు. నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌లో టెక్నాలజీ అండ్‌ నేషనల్‌ సెక్యూరిటీ సీనియర్‌ డైరెక్టర్‌గా తరుణ్‌ ఛాబ్రా, సీనియర్‌ డైరెక్టర్‌ ఫర్‌ సౌత్‌ ఏసియాగా సుమొన గుహ, కోఆర్డినేటర్‌ ఫర్‌ డెమొక్రసీ అండ్‌ హ్యూమన్‌ రైట్స్‌గా శాంతి కళాతిల్‌లను బైడెన్‌ ఎంపిక చేశారు. క్లైమేట్‌ పాలసీ అండ్‌ ఇన్నోవేషన్‌లో సీనియర్‌ అడ్వైజర్‌గా సోనియా అగర్వాల్, వైట్‌హౌజ్‌ కోవిడ్‌–19 రెస్పాన్స్‌ టీమ్‌కి పాలసీ అడ్వైజర్‌ ఫర్‌ టెస్టింగ్‌గా విదుర్‌ శర్మ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. వైట్‌హౌజ్‌ న్యాయవిభాగంలో అసోసియేట్‌ కౌన్సెల్‌గా నేహ గుప్తా, డిప్యూటీ అసోసియేట్‌ కౌన్సెల్‌గా రీమా షా ఇండో అమెరికన్‌ మహిళలుగా తమ సామర్ధ్యం నిరూపించుకోనున్నారు. ఇప్పుడు బైడెన్ టీంలో ఇంతలా భారతీయలుకు ప్రాధాన్యత ఇవ్వటం అగ్రరాజ్యంలో దక్కిన గౌరవంగా భావిస్తున్నారు.