ప్రారంభమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్
భారత 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ఈ రోజు ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని రూమ్ నెం.63లో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ మొదలుపెట్టి రాత్రికల్లా ఫలితం వెల్లడిస్తారు. లోక్‌సభ సెక్రెటరీ జనరల్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ సాగుతుంది. ఎన్డీయే కూటమి తరఫున బంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్(71), విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి, గవర్నర్ మార్గరెట్ ఆళ్వా (80) ఉపరాష్ట్రపతి బరిలో ఉన్నారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రులు సహా పలువురు ఎంపీలు, మంత్రులు ఓటేశారు. మాజీ ప్రధానమంత్రి, రాజ్యసభ ఎంపీ మన్మోహన్ సింగ్ ఓటు వేసేందుకు ఆయన వీల్‌ఛైర్‌లో పార్లమెంట్‌కు వచ్చారు. ఈ ఎన్నికకు సంబంధించి లోక్‌సభకు చెందిన 543, రాజ్యసభకు చెందిన 245 మంది ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో జమ్మూకశ్మీర్ నుంచి 4, త్రిపుర నుంచి 1, నామినేటెడ్ సభ్యులనుంచి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే నికరంగా 780 మందికి ఓటు వేసే హక్కు ఉంది. ఇందులో లోక్‌సభలో 23, రాజ్యసభలో 13 మంది సభ్యుల సంఖ్యాబలం ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించినందున ఆ పార్టీకి చెందిన 36 మంది సభ్యులు మినహాయించి మిగిలిన 744 మంది ఓటింగ్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఉభయసభల్లో ఎన్డీయే, దాని మిత్రపక్షాలకు స్పష్టమైన బలమున్నందున అధికారిక కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌కఢ్ గెలుపు దాదాపు లాంఛనమే. ఈనెల 10తో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది. కొత్త ఉపరాష్ట్రపతి ఈనెల 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ రోజు రాఖీపౌర్ణమి సెలవురోజైనప్పటికీ యథావిధిగా ఆ కార్యక్రమం కొనసాగనుంది.