భారత్‌లో 4 కొత్త అణ్వాయుధ వ్యవస్థలు

చైనాను ఎదుర్కొనేందుకే భారత్‌ అణ్వాయుధ సంపత్తిని, వార్‌హెడ్లను అభివృద్ధి పరుస్తోందని ఆ నివేదిక తెలిపింది. ప్రస్తుతం యావత్‌ చైనా భారత బాలిస్టిక్‌ క్షిపణుల పరిధిలో ఉందని విశ్లేషించింది.  మొదట్లో భారత్‌కు పాక్‌ నుంచి ముప్పు ఉండేది. ఆ మేరకు అణ్వాయుధాలను సమకూర్చుకుంది. ఇప్పుడు కేవలం చైనా లక్ష్యంగా తన అణు సంపత్తిని అభివృద్ధి చేస్తోంది అని స్పష్టం చేసింది. భారత్‌ నాలుగు కొత్త అణ్వాయుధ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోందని అమెరికా శాస్త్రవేత్తల సమాఖ్య(ఎ్‌ఫఏఎస్‌) వెల్లడించింది. ఓ వైపు దాయాదీ దేశం పాకిస్థాన్‌తో ముప్పు.. మరోవైపు చైనా కవ్వింపుల నేపథ్యంలో.. అణు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటోందని వివరించింది. ఇప్పటికే భారత్‌ వద్ద ఎనిమిది విభిన్న అణు సామర్థ్య వ్యవస్థలున్నాయని పేర్కొంది.  వీటిలో రెండు గగనతలం నుంచి ప్రయోగించేవి. నాలుగు భూతలం నుంచి ప్రయోగించే బాలిస్టిక్‌ క్షిపణులు. మరో రెండు సముద్ర ఉపరితలం నుంచి/సముద్రగర్భం నుంచి ప్రయోగించే బాలిస్టిక్‌ క్షిపణులు. వీటికి తోడుగా మరో నాలుగు అణ్వాయుధ వ్యవస్థలను అభివృద్ధిపరుస్తోంది. త్వరలో అవి అందుబాటులోకి రానున్నాయి అని స్పష్టం చేసింది. ఈ మేరకు విడుదల చేసిన ఎఫ్‌ఏఎస్‌-2022 వార్షిక నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.