దట్టంగా పెరిగిన కంప చెట్లు, పట్టించుకోని అధికారులు

కృష్ణాజిల్లా నందిగామ: ప్రధాన రహదారికి ఇరువైపులా కంపచెట్లు దట్టంగా పెరిగి ప్రమాదాలకు నెలవుగా మారుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒకప్పుడు 65వ నెంబర్ జాతీయ రహదారిగా ఉన్నప్పుడు జాతీయ రహదారి సంస్థ రోడ్డుకిరువైపులా ఎటువంటి కంపచెట్లు పెరగకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ రోడ్డుపై వర్షపు నీరు నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థను పటిష్ట పరుస్తూ ఉండేవారు. పరిటాల, కంచికచర్ల బైపాస్ రోడ్డు తో 65వ నెంబర్ జాతీయ రహదారి కాస్త ఆర్ అండ్ బి రహదారిగా మారిపోయింది. దీంతో జాతీయ రహదారి అధికారులు పరిటాల నుండి కంచికచర్ల వరకు రోడ్లు ఇరువైపులా శుభ్రం చేయక పోవడంతోడ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది అని, కంప చెట్లు ఏపుగా పెరిగి ప్రమాదాలకు నెలవుగా మారాయి అని పలువురు అంటున్నారు. రోడ్డుకిరువైపులా కంప చెట్లు ఏపుగా పెరిగి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లు, పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడంతో ములుపుల వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంచికచర్ల నుండి నందిగామ వెళ్లే రహదారిలో కంచికచర్ల చెరువు దగ్గర రహదారిపై కంపచెట్లు ఏపుగా పెరిగి ప్రయాణీకుల కు ఇబ్బంది కరంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి రోడ్డుకిరువైపులా పిచ్చిమొక్కలు తొలగించాలని, డ్రైనేజీ పూడికతీత పనులు ప్రారంభించాలని కంచికచర్ల ప్రజలు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు.