ఫిబ్రవరి1 నుండి విజయనగరం జిల్లాలో ఇంటివద్దకే రేషన్ – కలెక్టరు..

విజయనగరం జిల్లాలోని బియ్యం కార్డుదారులందరికి ఫిబ్రవరి 1 నుండి ఇంటివద్దకే వాహనాల ద్వారా రేషన్ అందించే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎం.హరి జవహర్ లాల్ పేర్కొన్నారు. ఇప్పటికే వాహనాలు జిల్లాకు చేరు కున్నాయని, ఈ నెల 21న పిటిసి లో లబ్దిదారులందరికి వాహనాలను కేటాయించనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్లు డా.జే.సీ.కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్ రవిరాల, అదనపు ఎస్.పి శ్రీ దేవి రావు తో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఇంటింటికి రేషన్ సరఫరా కోసం జిల్లాకు 458 వాహనాలను కేటాయించడం జరిగిందని..

ఈ వాహనాల ద్వారా జిల్లాలోని 778 సచివాలయాల పరిధి లో నున్న 1407 రేషన్ దుకాణాల నుండి ఇంటింటికి రేషన్ అందజేయడం జరుగుతుందని, ప్రతి వాహనం ద్వారా సుమారు1500 కార్డుదారులకు సరఫరా చేస్తారన్నారు. వాహనాలను నడిపే ప్రతి ఆపరేటర్కు ఒక వి.ఆర్.ఓ ను నోడల్ అధికారిగా నియ‌మించ‌డం జరిగిందని, వీరి పర్యవేక్షణ లో రేషన్ సరఫరా జరుగుతుందని తెలిపారు. ఆపరేటర్లు గ్రామాల్లో ఉన్న డీలర్లు, వాలంటీర్లతో పరిచయాలు చేసుకొని రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటారని, పంపిణీ కి ఒక రోజు ముందే మెటీరియల్ అందజేయడం జరుగుతుందని అన్నారు. అలాగే ఆపరేటర్లకు టి షర్టులను ఏకరూప దుస్తులుగా ఇవ్వడం జరుగుతుందని, ప్రతి వాహనం రిజిస్ట్రేషన్,ఇన్సురెన్సు ,బ్యాంకు ఋణం తదితర అవసరాలను సంయుక్త కలెక్టర్ (అభివృద్ధి) పర్యవేక్షిస్తారని అన్నారు. పంపిణీ విధానం, ఈ పాస్, తూకం, ఇంటర్ నెట్ వినియోగం తదితర అంశాల పై శిక్షణ ఉంటుందని తెలిపారు.