అదానీ గ్రూప్‌పై ఆరోపణలు గుప్పించిన హిండెన్‌బర్గ్

 ముఖ్యమైన సమస్యల నుంచి దృష్టి మళ్ళించేందుకు ప్రయత్నిస్తూ, జాతీయవాద దృక్పథాన్ని లేవనెత్తుతోందని అదానీ గ్రూప్‌పై   హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సోమవారం మళ్లీ విరుచుకుపడింది. ఈ గ్రూప్ తన వేగవంతమైన, ఆకర్షణీయమైన అభివృద్ధిని, దాని చైర్మన్ సంపద పెరుగుదలను భారత దేశ విజయానికి ముడిపెడుతోందని దుయ్యబట్టింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్  ఆదివారం సమాధానం చెప్తూ, అమెరికన్ షార్ట్ సెల్లర్స్ ‘మడాఫ్స్ ఆఫ్ మన్‌హటన్’  అని ఆరోపించింది. అమెరికన్ మోసగాడు, ఫైనాన్షియర్ బెర్నార్డ్ లారెన్స్ మడాఫ్ ప్రపంచ చరిత్రలో అతి పెద్ద పోంజీ కుంభకోణానికి పాల్పడిన విషయాన్ని గుర్తు చేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ బయటకు చెప్పని కారణాలతో ఈ ఆరోపణలు చేసిందని 413 పేజీలతో కూడిన ఈ సమాధానంలో పేర్కొంది.