సీఎం జగన్‌కు హీరో నాని రిక్వెస్ట్.. పవన్ కళ్యాణ్‌కు థాంక్స్..

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వానికి.. పలువురు మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇటీవల హీరో నాని ‘టక్ జగదీష్’ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడం, ఆయనపై పలువురు అసహనం వ్యక్తం చేయడాన్ని కూడా ప్రస్తావించారు. ‘ పాపం ఈ మధ్యన హీరో నానీ గారిని కొంతమంది తెగ తిడుతూ ఉంటే నాకు చాలా బాధ కలిగింది. ఆయన అక్రమాలు.. అన్యాయాలు ఏమీ చేయలేదు.. ఆయన హీరోగా ఒక సినిమా చేసుకున్నాడు. ఆ సినిమా రిలీజ్‌కి వెళ్లాలనుకున్నాడు. ఒక వైపున థియేటర్లు మూతపడ్డాయి.. గత్యంతరం లేక ఆయన ఓటీటీ వైపు వెళ్లాడు. అప్పుడు థియేటర్ల యజమానులంతా ఆ అబ్బాయి మీద పడితే ఆయన ఏం చేస్తాడు? వెళ్లి వైసీపీ నాయకులతో మాట్లాడుకోండి. ఆ అబ్బాయి మీద పడటం వలన ప్రయోజనం ఏముంటుంది? ఇందులో ఆ అబ్బాయి తప్పేమి ఉంది?’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

దీనిపై హీరో నాని స్పందించారు.. సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కరించండి అంటూ ఏపి ప్రభుత్వానికి హిరో నాని విజ్ఞప్తి చేశారు. ట్విట్టర్ వేదికగా నాని ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ గారికి, ఏపి ప్రభుత్వం మధ్య రాజకీయ విభేదాలను పక్కన పెట్టండి.. చిత్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించడానికి తక్షణం శ్రద్ధ తీసుకోవడం అవసరం. సినిమా పరిశ్రమ సభ్యుడిగా నేను వైఎస్ జగన్ గారు, సంబంధిత మంత్రులను వినయంగా అభ్యర్థిస్తున్నాను..సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారంలో ఎటువంటి డిలే లేకుండా చూడండి’ అంటూ నాని ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా తనకు మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్‌కు నేచురల్ స్టార్ నాని థ్యాంక్స్ చెప్పారు.