పుల్వామాలో భద్రతా దళాలపై గ్రనేడ్‌ దాడి: నలుగురికి గాయాలు

జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై గ్రనేడ్‌ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం పుల్వామా చౌక్‌ వద్ద భద్రతా దళాల వాహనం వైపు ఉగ్రవాదులు గ్రనేడ్‌ను విసరగా.. అది రోడ్డు పక్కన పేలింది. ఈ దాడిలో గాయడిన నలుగురిని అధికారులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మంగళవారం జరిగిన ఒక్క గ్రనేడ్‌ దాడి మాత్రమే కాదు.. ఇటీవలి కాలంలో పుల్వామాలో ఉగ్రవాదుల గ్రనేడ్‌ దాడులు పెరిగాయని భద్రతా దళ అధికారులు పేర్కొన్నారు. గత వారం పుల్వామాలోని చనాపోరా ప్రాంతంలో జరిగిన గ్రనేడ్‌ దాడిలో ఇద్దరు మహిళలతో సహా, ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఇక సోమవారం కూడా రద్దీగా ఉండే పరిమిపిరా పంథా చౌక్‌ వద్ద ఉగ్రవాదులు దాడికి పాల్పడేందుకు సిద్ధం చేసిపెట్టిన ఆరు గ్రనేడ్‌లను భద్రతా దళాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి.