థర్డ్ వేవ్ కు కోవిడ్ సెంటర్లలో పూర్తిస్థాయి సేవలకు వైద్యులు సిద్ధంగా ఉండండి: కలెక్టర్ జె.నివాస్

జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్ కేర్ సెంటర్లను పూర్తి స్థాయిలో వైద్య సేవలకు సిద్ధంగా సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ వైద్యులు, అధికారులను ఆదేశించారు. డా. పిన్నమనేని ఆసుపత్రికి మంగళవారం విచ్చేసి, కోవిడ్ చికిత్సా విభాగాలను అధికారులు, వైద్య సిబ్బందితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ ఉధృతి పెరుగిందని, ఇది థర్డ్ వేవ్ ప్రారంభానికి సూచనన్నారు. కోవిడ్ కేసులు గతంలోకన్నా అధిక సంఖ్యలో నమోదవుతున్నాయన్నారు. థర్డ్ వేవ్ లో కోవిడ్ తో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా పటిష్టమైన వైద్య సేవలందించేలా వైద్య సిబ్బంది సేవలందించాలన్నారు. కోవిడ్ ఫస్ట్, థర్డ్ వేవ్ లలో డా. పిన్నమనేని సిద్దార్థ వైద్య కళాశాలలో ఏర్పాటుచేసిన కోవిడ్ చికిత్సా కేంద్రంలో వైద్య సిబ్బంది ఉత్తమ వైద్య సేవలందించారని, దీనితో కోవిడ్ మరణాలను సాధ్యమైనంతమేర నివారించగలిగామన్నారు. పెరుగుతున్న కోవిడ్ కేసులకు అనుగుణంగా ఎంత మంది కోవిడ్ పేషంట్లు వచ్చినా కోవిడ్ కేర్ సెంటర్లలో పేషంట్లకు పూర్తి స్థాయిలో వైద్య సేవలందించే దిశగా వైద్యులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. కోవిడ్ మొదటి వేవ్ సమయంలో 250 ఆక్సిజన్ బెడ్స్, 30 ఐ సి యు బెడ్స్ ఉండేవని, పిన్నమనేని ఆసుపత్రిలో 600 ఆక్సిజన్ బెడ్స్, 120 ఐ సి యు బెడ్స్ కు పెంచామన్నారు.

కోవిడ్ అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రిలో అత్యాధునిక ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని, దానితో పాటు అదనంగా 30 కె.ఎల్. సామర్ధ్యంతో మరో ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రిలోని ట్రై ఏజ్ కేంద్రంలో 30 మంది కోవిడ్ పేషంట్లకు వైద్య సేవలందేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ పేషంట్లు ఎట్టి పరిస్థితులలోనూ ఆక్సిజన్ కొరత రాకుండా ముందుగానే పరిశీలించుకోవాలన్నారు. కోవిడ్ సెంటర్లలో మందులు, సిబ్బందికి ఎటువంటి కొరతా లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలన్నారు.  కరోనా సెకండ్ వేవ్ లో ప్రాణ నష్టాలకు కారణాలను దృష్టిలో ఉంచుకుని థర్డ్ వేవ్ లో అటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాక్సిన్ తీసుకున్న వారికి కోవిడ్ సోకినా వైరస్ తీవ్రత ఎక్కువలేకుండా మరణ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అందరూ వాక్సినేషన్ వేసుకునేలా ప్రజలలో ఇంకా అవగాహన కలగవలసిన అవసరం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్, రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి, తహసీల్దార్లు నరసింహారావు, వనజాక్షి, డా.పిన్నమనేని వైద్య కళాశాల డైరెక్టర్ జనరల్ చదలవాడ నాగేశ్వరావు, ప్రిన్సిపాల్ పిఎన్ఎస్ మూర్తి ,ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది , ప్రభృతులు పాల్గొన్నారు.