చేయూత కాదు , ఆర్థికసాయం పేరుతొ జరిగే జగన్నాటకం

ఆర్థికసాయం పేరుతొ మహిళలకు నమ్మకద్రోహం , 45 ఏళ్ళు దాటిన మహిళలకు రూ . 3 వేల పెన్షన్ హామీపై మాట తప్పి మడమ తిప్పింది ఈ ప్రభుత్వమని కొనకళ్ల నారాయణరావు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, కొనకళ్ల నారాయణరావు, బుధవారం ఆయన కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశం వివరాలు. వైసీపీ ఎన్నికల ముందు 45ఏళ్ళు దాటిన బీసీ , ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ మహిళలకు రూ . 3 వేల చొప్పున ప్రతినెలా పెన్షన్ ఇస్తామన్నారు. కానీ అధికారంలోకి రాగానే పెన్షన్ కాదు ఐదేళ్లకు సరిపడా సాయం అందిస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు, కానీ ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇచ్చి మహిళా లోకాన్ని ముంచుతున్నారని తెలిపారు. ఎన్నికల హామీ మేరకు ప్రతి మహిళకు రూ 3వేలు పింఛన్ అనుకున్నా ఏడాదికి రూ . 36,000/- అవుతుంది. అంటే ఐదేళ్లకు రూ 1.80 లక్షలు అవుతుంది, కానీ ఐదేళ్ళలో మహిళలకు ఇస్తుంది రూ 75,000/- మాత్రమే అని రూ 1.05 లక్షల చొప్పున ఎగనామం పెడుతున్నారని, ప్రత్యక్షంగానే మహిళలు ఇంత నష్టపోతున్నారని, ఇది ముమ్మాటికీ చేయూత కాదని, మహిళలకు ఇచ్చిన హామీపై మాట తప్పి మడమ తిప్పడమని కొనకళ్ల విమర్శించారు.

ప్రస్తుతం డ్వాక్రా సంఘాల్లో వున్నా వారంతా దాదాపుగా 45-60 ఏళ్ల వయస్సు మధ్యవారే అని సుమారు 98 లక్షలు మంది డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా వున్నారని మరి వారందరిలో కొంతమందికే చేయూత అందడం ఏంటని ప్రశ్నించారు.తెదేపా హాయంలో 93 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పసుపు – కుంకుమ అందజేస్తే, ప్రస్తుతం ఈ ప్రభుత్వం మాత్రం ఆ సంఖ్యను 23 లక్షలకు కుదించి వారికి మాత్రమే లబ్ది చేకూరేలా చేయడం అన్యాయం కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎన్నికల ముందు తాము ఇచ్చిన హామీని నెరవేర్చాలని, ఎంతో మంది అక్కచెల్లెలకు లబ్ది చేకూరేలా చేయాలని , ప్రభుత్వం చేయూత ద్వారా కొంతమందికే లబ్ది చేకూర్చడం వలన వెనుకబడిన తరగతులకు అనాయ్యం చేసినట్లే అని కొనకళ్ల నారాయణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.