నేడు భారత తొలి మహిళా టీచర్ సావిత్రి బాయి పూలే వర్థంతి.

భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతులేని వివక్షలను ఎదుర్కొంటూ ఆడపిల్లల చదువుల కోసం పోరాడిన మహానుభావురాలు సావిత్రిబాయి పూలే. మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం సావిత్రిబాయి పూలే.

సావిత్రీబాయి ఫూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నైగాన్ గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో 1831, జనవరి 3న జన్మించిన ఆమె మొదటి ఫెమినిస్ట్ గా మహారాష్ట్రలో సామాజిక సంస్కరణ ఉద్యమ కార్యకర్త. భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. తొమ్మిదేళ్ల వయసులోనే 13 ఏళ్ల జ్యోతిబా ఫూలేను వివాహం చేసుకున్నారు. జ్యోతిరావ్ కు పుస్తకాలు చదవటం అంటే ప్రాణం. పిల్లలందరు చదువుకోవాలని ఆకాంక్షించేవారు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులు. అలా ఇద్దరు అణగారిని వర్గాల పిల్లలకు చదువు చెప్పాలనుకున్నారు.ముఖ్యంగా సావిత్రిబాయి పూలే ఆడపిల్లల చదువుల కోసం చేసిన కృషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.కేవల పిల్లలకు పాఠాలు చెప్పటమే కాదు ఆడపిల్లలకు కష్టం వచ్చింది అంటే నేనున్నాననే వారు. అలా దంపతులు ఇద్దరు కలిసి మొదటిసారిగా భారతదేశంలో గర్ల్స్ స్కూల్ స్థాపించారు.

ఈక్రమంలో సావిత్రిబాయి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆమెను అంటరానివ్యక్తిగా చూసేవారు. రోడ్డుమీద వెళుతుంటే పేడ నీళ్లు కొట్టేవారు. కానీ ఆమె ఏమీ ప్రశ్నించేది కాదు.అస్సులు సమాధానం కూడా చెప్పేది కాదు.అలాగని ఆడపిల్లలకు చదువు చెప్పటం ఆపేది కాదు. తమ సంఘం నుంచి బహిష్కరణకు గురైనప్పటికీ ఆమె మాత్రం ఆడ పిల్లలు చదువుకునేందుకు బాటలు వేశారు. తన భర్తతో కలిసి బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించి ఆ తర్వాత అలాంటి 18 పాఠశాలలను స్థాపించి మన్నలను అందుకున్నారు. మొదటి బాలికల పాఠశాలకు కేవలం 9 మందే వచ్చేవారు. వారికే సావిత్రీబాయి పాఠాలు బోధించేవారు. ఆ బాలికలు చదువు మానేయకుండా ఉండాలని వారికి స్టైఫండ్ పేరిట కొంత డబ్బు ఇచ్చేవారు. వారి సొంత డబ్బునే ఇచ్చేవారు. 18 ఏళ్ళ వయసు లోనే విద్యా ఉద్యమం చేపట్టిన మొదటి ఉపాధ్యాయురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. సమాజంలో ఎదురవుతున్న అవమానాలను సైతం లెక్కచేయ కుండా మహిళలతో పాటు బడుగు బలహీనవర్గాల కోసం పోరాటం చేశారు. మహిళా సేవామండల్‌ ను స్థాపించి మహిళలను చైతన్య పరిచారు. వితంతువులకు వివాహాలు చేసేవారు. వారి కాళ్లమీద వారు నిలబడేలా చేసేవారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీలు చదువుకొనేందుకు ఆమె స్కూల్ ప్రారంభించారు. ఆమె విప్లవ ప్రసంగాలు ఆనాటి మహిళల్లో ఎందరికో స్ఫూర్తిని కలిగించాయి.

కుల వివక్షతపై పోరాటం చేసిన వారిలో సావిత్రీబాయి దంపతులు ముందు వరసలో ఉంటారని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చదువుకుంటున్న రోజుల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న సావిత్రిబాయి ఆడపిల్లలు చదువుకోవడం ఎంత కష్టమో అర్థం చేసుకున్నారు. అందుకే బాలికలకు విద్యను అందించాలని ఆమె పోరాడారు. ఆమె విద్యావేత్త మాత్రమే కాదు ఒక అద్భుతమైన కవయిత్రి కూడా. జీవితంలో వివక్ష, కుల అఘాయిత్యాలు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఎన్నో పద్యాలు రాశారు. ‘‘కావ్యఫూల్’’ అనే కవితా సంపుటి ఆమె చేతినుంచి జాలువారిందే. అందులోని కవితలు సమాజంలో అవిద్యను రూపుమాపి, కులాలకతీతంగా అందరూ విద్యాహక్కు కలిగుండాలనే భావాలతో రాసినవి.

బాల్య వివాహాలను అడ్డుకునేవారు.బాలికలకు చేయాల్సింది వివాహం కాదు చదువుకునేలా చేయాలని ఇంటింటికీ వెళ్లి చెప్పేవారు. ఆ కాలంలో అలా చేయటం అంటే సాహసమనేచెప్పాలి. అలా ఆమె ఇంటికి వెళితే ఆమె మొహంమీదనే తలుపులు వేసేవారు. దూషించేవారు. నీలాగా మా పిల్లల్ని కూడా రోడ్ల వెంట తిప్పాలా? అంటూ అవమానించేవారు. కానీ సావిత్రిబాయి అవేమీ పట్టించుకోకుండా తన పట్టు విడవకుండా ఆడపిల్లల చదువు కోసం పోరాడారు. 1890వ కాలంలో ప్లేగు వ్యాధితో నరకయాతన పడుతున్న పిల్లలకు చికిత్స అందించేలా సావిత్రిబాయి ఎంతో కృషి చేశారు. అంతేకాదు అప్పటి ఆర్థిక సంక్షోభంలో సైతం రెండు వేల మంది చిన్నారులకు ఆహారం పెట్టించి తన గొప్ప మనసు చాటుకున్న మానవతామూర్తి సావిత్రిబాయి. ఎంతోమందిని ప్లేగు వ్యాధి నుంచి కాపాడిన ఆమె ఆఖరికి ఆ వ్యాధి కారణంగానే ప్రాణాలు విడిచారు.

మార్చి 10, 1897లో మరణించినప్పుడు సావిత్రిబాయి వయస్సు 66 యేళ్లు. ఆమె భౌతిక కాయానికి దత్తత కొడుకు యశ్వంత్‌ అంతిమ సంస్కారాలు జరిపించారు. అయితే డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటే.. సావిత్రీబాయి ఫూలే పుట్టిన రోజును మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవాల్సిన అసవరం ఎంతైనా ఉంది. పాఠశాలలు కేవలం బ్రాహ్మణ పిల్లలకే పరిమితమైన రోజుల్లో.. జ్యోతిభాపూలే నిమ్నజాతుల పిల్లల కోసం పాఠశాలలు స్థాపించారు. ఆ తర్వాత సావిత్రిబాయి మహిళల కోసం ఒక ప్రత్యేక పాఠశాలను స్థాపించారు. ఆ విధంగా ఆమె భారతదేశంలో స్థాపించబడిన మొదటి మహిళా పాఠశాలకి అధ్యాపకురాలిగా చరిత్రపుటల్లో స్థానం సంపాదించుకున్నారు. 1890 నవంబరు 28 తేదిన జ్యోతిభాపూలే మరణించిన సమయంలో.. తన భర్తకు తానే స్వయంగా చితిపెట్టి మరో విప్లవానికి తెరలేపారు సావిత్రిబాయి. అలాగే ఆమె భర్త చనిపోయాక..తన బొట్టు తీయలేదు, శిరోముండనం చేయించుకోలేదు. ఇది ఆరోజుల్లో పెద్ద సంచలనమే అయ్యింది.మహిళా సాధికారతలో తనదైన శైలిలో సావిత్రిబాయి పూలే పేరొందారు