కరోనా తొలి ఔషధానికి FDA ఆమోదం

కొవిడ్‌-19 రోగులకు చికిత్స అందించే తొలి ఔషధానికి గురువారం అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ప్రయోగాత్మకంగా ఇస్తున్న యాంటీవైరల్‌ డ్రగ్‌ రెమిడెసివిర్‌ను పూర్తిస్థాయి కరోనా ఔషధంగా వినియోగించేందుకు అనుమతించింది. దీంతో కరోనా చికిత్సకు ఆమోదం పొందిన తొలి ఔషధంగా రెమిడెసివిర్‌ నిలిచింది.
కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఔషధ తయారీ సంస్థ గిలీద్‌ సైన్సెస్‌ రెమిడెసివిర్‌ను వెక్లరీ పేరిట ఉత్పత్తి చేస్తోంది. కొవిడ్‌-19 బాధితులు కోలుకునే సమయాన్ని ఇది 15 నుంచి 10 రోజులకు తగ్గిస్తున్నట్లు అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్‌ఐహెచ్‌) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు అధ్యయనాల్లో తేలింది. కరోనా బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం చికిత్సలో భాగంగా రెమిడెసివిర్‌ను తీసుకున్నారు.