పట్టువదలని భార్యాభర్తలు
ఓ జంట ఆడపిల్ల పుట్టేంతవరకు పిల్లల్ని కంటూ పోయింది. అలా ఒకరిద్దరు కాదు, ఏకంగా 14 మంది కొడుకులకు జన్మనిచ్చారు. ఎట్టకేలకు ఈ మధ్యే ఓ ఆడబిడ్డను కని వారి కలను సాకారం చేసుకున్నారు. ఈ అరుదైన ఘటన అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. జై, కేటరీ స్కీవాండ్ దంపతులకు ఆడపిల్ల అంటే ఎంతో ఇష్టం. ఒక కూతురు ఉంటే బాగుంటుందని చాలాసార్లు అనుకున్నారు. కానీ వారి ఆశలను నీరుగాస్తూ ప్రతిసారి అబ్బాయిలే జన్మించారు. అలా ఈ దంపతుల సంతానం 14 మందికి చేరింది. తర్వాత కేటరీ మరోసారి గర్భం దాల్చింది. ఈసారి కూడా మగబిడ్డే పుడతాడని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా వారి జీవితాల్లో వెలుగు నింపుతూ గురువారం(నవంబర్ 5న) అమ్మాయి ప్రసవించింది. దీంతో ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సుమారు మూడున్నర కిలోల బరువుతో జన్మించిన ఆ శిశువుకు మ్యాగీ జేన్ అని నామకరణం చేసి పిలుచుకుంటున్నారు. “ఈ సంవత్సరం మాకు మర్చిపోలేనిది, మ్యాగీ మా జీవితాల్లోకి రావడం అన్నింటికన్నా పెద్ద గిఫ్ట్” అని కేటరీ చెప్పుకొచ్చారు. మా ముద్దుల చెల్లెలను గుండెల మీద ఆడిస్తామంటూ 14 మంది అన్నలు సంబరపడిపోతున్నారు.