శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నాఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము

శుక్రవారం ఉదయం పదిన్నరకు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము  నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. గురువారం భువనేశ్వర్‌ నుంచి దిల్లీ చేరుకున్న ద్రౌపది ముర్ముకు విమానాశ్రయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సహా ఇతర నేతలు స్వాగతం పలికారు. దిల్లీలోని ఒడిశా భవన్‌లో ద్రౌపది ముర్ము బస చేయనున్నారు. నామినేషన్ దాఖలు చేసే వరకు ద్రౌపది ముర్ముకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహాయకారిగా ఉండనున్నారు.  ద్రౌపది ముర్ము నామినేషన్‌ పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ సీఎంలు సంతకాలు చేయనున్నారు. దిల్లీకి చేరుకున్నఅనంతరంఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షాతో ముర్ము భేటీ అయ్యారు. ముర్ముతో భేటీ పై ట్విట్టర్‌లో స్పందించిన మోదీ.. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె ఎంపికను సమాజంలోని అన్ని వర్గాలు ప్రశంసిస్తున్నాయని తెలిపారు. క్షేత్ర స్థాయిలోని సమస్యలపై ముర్ముకు ఉన్న అవగాహన, దేశ అభివృద్ధి పట్ల ఆమె దూరదృష్టి అద్భుతం అని మోదీ కొనియాడారు.