దేశంలోనే అబద్ధాల ముఖ్యమంత్రి అన్న బిరుదు మీకుంది: డీకే అరుణ

 కేసీఆర్‌కు సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే రోగం ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దళితబంధు అమలు నుంచి తప్పించుకోవడానికి, హుజూరాబాద్‌ ఓటమి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలంటూ కొత్త డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలోనే అబద్ధాల ముఖ్యమంత్రి అన్న బిరుదు మీకుంది. ప్రజలను ఇంకా మోసం చేయాలని చూడవద్దు. దొంగ వేషాలు మానుకోండి అని సీఎం కేసీఆర్‌కు డీకే అరుణ సూచించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కేసీఆర్‌కు ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో ధర్నా చేసే అర్హత లేదన్నారు. ‘‘పంజాబ్‌ రైతులపై కలిగిన జాలి.. మన రాష్ట్రంలో మీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతులపై ఎందుకు కలగడం లేదు? 1400 మంది అమరులపై జాలి, దయ ఎందుకు కలగలేదు? ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలన్న సోయి ఎందుకు రాలేదు? మీరు హామీ ఇచ్చినట్లుగా ఒక్క ఏరియా ఆస్పత్రినైనా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి చేశారా? మెడికల్‌ కాలేజీలు ఎక్కడెక్కడ కావాలో  కేంద్రానికి ఎన్ని ప్రతిపాదనలు పంపారు?’’ అని అరుణ ప్రశ్నల వర్షం కురిపించారు. దళిత బంధు కోసం, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం కేసీఆర్‌ను వెంటాడుతామని, వేటాడుతామని ప్రకటించారు