బాణాసంచాపై ఢిల్లీ స‌ర్కార్ బ్యాన్.. కేజ్రీవాల్ తాజా ప్ర‌క‌టన

దీపావళి సందర్భంగా బాణాసంచాను బ్యాన్ చేసింది ఢిల్లీ ప్రభుత్వం. బాణాసంచాను నిల్వ చేయడం, అమ్మడం, ఉపయోగించడాన్ని నిషేధిస్తున్న‌ట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ప్ర‌క‌టించారు.

దీపావళి సందర్భంగా గత మూడేళ్లుగా ఏర్ప‌డుతున్న‌ ప్రమాదకరమైన కాలుష్య స్థాయిలను పరిగణనలోకి తీసుకుని, ఈ సారి కూడా బాణాసంచాపై నిషేధం విధిస్తున్నామ‌ని తెలిపారు. ఈ మేర‌కు కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేశారు.

గత ఏడాది కూడా ఢిల్లీలో బాణాసంచాపై నిషేధం విధించింది అక్క‌డి ప్ర‌భుత్వం. నాడు ఆల‌స్యంగా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌డం కార‌ణంగా.. బాణాసంచాను అప్ప‌టికే కొనుగోలు చేసి నిల్వ ఉంచుకున్న‌ వ్యాపారులకు నష్టం వాటిల్లిందని కేజ్రీవాల్ తన ట్వీట్‌లో గుర్తు చేశారు. గ‌త అనుభ‌వం దృష్ట్యా.. వ్యాపారులెవ‌రూ బాణాసంచాను నిల్వ చేయవద్దని అభ్యర్థించారు.