కరోనా బిందువుగా నిలిచిన ‘చైనా’లో మళ్లీ కరోనా కలకలం- అక్కడ లాక్​డౌన్​

కరోనా పుట్టుకకు కేంద్ర బిందువుగా నిలిచిన చైనాలో మరోమారు కొవిడ్‌ కేసులు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండటం డ్రాగన్‌ దేశాన్ని కలవరానికి గురిచేస్తోంది. దక్షిణ చైనా ప్రావిన్స్‌ ఫుజియాన్‌లో సోమవారం 59 మంది కరోనా బారిన పడినట్లు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్‌ వెల్లడించింది. ఆదివారం నాడు ఫుజియాన్‌లో 22 కేసులు మాత్రమే నమోదు కాగా.. ఒక్క రోజు వ్యవధిలోనే అవి రెట్టింపు అయ్యాయి. దానికి తోడు కొత్త కేసులన్నీ డెల్టా వేరియంట్‌కి సంబంధించినవే కావడం వల్ల అక్కడి ఆరోగ్య నిపుణులు ఆందోళనకు గురవుతున్నారు. అటు నాలుగు రోజుల వ్యవధిలో ఫుజియాన్‌ ప్రావిన్స్‌లోని మూడు నగరాల్లో మొత్తం 102 కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య కమిషన్‌ వెల్లడించింది.

లాక్​డౌన్​..
ఫుజియాన్‌ ప్రావిన్స్‌లో కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్‌ వ్యాప్తికి అధిక అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను విధించారు. అలాగే పాఠశాలలు, సినిమా థియేటర్లు, బార్లను మూసివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. అనవసరంగా ఎవరూ ఇంటి నుంచి బయటకి రావద్దన్న ఫుజియాన్‌ అధికారులు.. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఫుజియాన్‌ ప్రావిన్స్‌లోని గ్జియామెన్‌ నగరం టూరిజం ప్రాంతాలకు కేంద్రంగా ఉండగా.. అక్కడ కూడా డెల్టా వేరియంట్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో నగరాన్ని కఠిన ఆంక్షల్లోకి నెట్టారు అధికారులు. 60 శాతం విమానాలను రద్దు చేసినట్లు గ్జియామెన్‌ విమానాశ్రయం మంగళవారం ప్రకటించింది. అలాగే కరోనా బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారిపై దృష్టి సారించి.. వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌గా నిర్ధరణ అయిన బాధితులను వెంటనే ఐసోలేషన్‌కు తరలిస్తున్నారు.