నియంతృత్వానికి ఎదురు నిలిచిన వారి పై దాడులు చేస్తున్నారు – రాహుల్ గాంధీ

ప్రజాస్వామ్యం మరణాన్ని మనం చూస్తున్నాం. శతాబ్దకాలంపాటు ఇటుక ఇటుక పోగేసి నిర్మించిన భారత దేశం మన కళ్ల ముందే ధ్వంసమైపోతోంది. నియంతృత్వానికి ఎదురు నిలిచినవారిపై దాడులు చేస్తున్నారు, జైల్లో వేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, హింస.. ఇలా ప్రజాసమస్యలేవీ ప్రస్తావించరాదన్నదే వారి ఆలోచన. నలుగురు, ఐదుగురు ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది.  నేషనల్ హెరాల్డ్​ కేసులో కాంగ్రెస్​ అగ్రనేతల్ని విచారించడంపై స్పందించారు రాహుల్. తమను ఎంతైనా ప్రశ్నించుకోవచ్చని అన్నారు. అసలు అక్కడ (హెరాల్డ్ కేసులో) ఏమీ లేదన్న విషయం అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. వారు గాంధీ కుటుంబంపై ఎందుకు దాడి చేస్తారు? ఎందుకంటే.. మేము ఒక సిద్ధాంతం కోసం పోరాడతాం కాబట్టి. మాలాంటి వారు కోట్ల మంది ఉన్నారు. మేము ప్రజాస్వామ్యం కోసం, సమాజంలో సామరస్యం కోసం పోరాడతాం. ఎన్నో ఏళ్లుగా ఇలానే చేస్తున్నాం. మా కుటుంబం ప్రాణత్యాగాలు చేసింది. ఈ సిద్ధాంతం కోసం పోరాడేటప్పుడు అది మా బాధ్యత కూడా. రెండు వర్గాల మధ్య గొడవలు పెడుతుంటే, దళితుల్ని చంపేస్తుంటే, మహిళల్ని కొడుతుంటే చాలా బాధ కలుగుతుంది. అందుకే మేము పోరాడతాం. ఇది ఒక కుటుంబం కాదు.. ఒక సిద్ధాంతం ..అని మండిపడ్డారు రాహుల్ గాంధీ.