మునిగిపోతున్న నౌక నుంచి 16 మందిని రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్

ముంబై: మునిగిపోతున్న రవాణా నౌక నుంచి భారత తీర రక్షక దళం (ఐసీజీ) 16 మందిని రక్షించింది. వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారడంతో ముంబై తీర ప్రాంతంలో ఓ రవాణా నౌక ముునిగిపోయింది. రేవ్‌దండా జెట్టీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్టు ఐసీజీ తెలిపింది. మునిగిపోతున్న మంగళం అనే నౌక నుంచి సాయం కోరుతూ వచ్చిన సందేశంతో డామన్ నుంచి రెండు చేతక్ హెలికాపర్టు రంగంలోకి దిగాయి. అలాగే, మునుగుతున్న ఓడలో చిక్కుకుపోయిన సిబ్బందిని రక్షించేందుకు ముంబైలోని మురుద్ జంజీరా కోట నుంచి సుభద్ర కుమారి చౌహాన్ నౌక బయలుదేరింది. అనంతరం అన్నీ కలిసి సమన్వయం చేసుకుంటూ నౌకలో చిక్కుకున్న 16 మందిని రక్షించాయి.