సుప్రీంకోర్టులో ఓ అరుదైన దృశ్యం.

బుధవారం ఉదయం సుప్రీంకోర్టులో వివాహానికి సంబంధించిన ఓ కేసు విచారణకు వచ్చింది. కక్షిదారు అయిన ఓ మహిళ తన వాదనలు వినిపించాల్సి ఉంది. అయితే ఆంగ్లంలో మాట్లాడేందుకు ఆమె ఇబ్బంది పడుతున్నారని.. జస్టిస్ రమణ అర్థం చేసుకున్నారు. తన వాదనల్ని తెలుగులోని వినిపించాలని సూచించారు. ఆమె చెప్పిన విషయాన్ని ఆంగ్లంలోకి అనువదించి, తన సహచర న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు వివరించారు జస్టిస్ రమణ. జస్టిస్ ఎన్వీ రమణ ఇంగ్లిష్‌లో ట్రాన్స్‌లేట్ చేసి వివరించడం హైలెట్‌గా చెప్పుకోవచ్చు.

సుప్రీం కోర్టు స్థాయిలో కక్షిదారులను కోర్టుకు పిలవరు. వారి తరఫు న్యాయవాదులే వాదిస్తుంటారు. అయితే, ఇక్కడే జస్టిస్ ఎన్వీ రమణ తన ప్రత్యేకతను చాటుకున్నారు. సుదీర్ఘ కాలంగా దూరంగా ఉన్న భార్యాభర్తల మనోగతాన్ని స్వయంగా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా వారిద్దరూ కలిసి జీవితంలో ముందుకు సాగేలా వారికి సర్ధి చెప్పారు. బాధితులు తెలుగులో వారి మనోవేదనలను తెలిపారు.

మాతృ భాషపై గౌరవం

జస్టిస్ ఎన్​.వి.రమణకు మాతృభాషపై మమకారం ఎక్కువ. తెలుగువాడిగా పుట్టినందుకు గర్వించాలని అనేక సందర్భాల్లో ఆయన అన్నారు.  ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే జరగాలని, న్యాయస్థానాల్లో తెలుగును ప్రోత్సహించాలనేది జస్టిస్‌ రమణ అభిలాష.