చిన్నారి ప్రాణం నిలబెట్టిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్

కరోనా కష్టకాలంలో అత్యవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు విడుస్తున్నారన్న వార్తతో చలించి సహృదయంతో ముందుకువచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంక్ లు అందుబాటులోకి తీసుకువచ్చిన మెగాస్టార్ చిరంజీవి కి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రు గ్రామ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే పైడిపర్రు గ్రామానికి చెందిన శ్రీనివాస్ దంపతులకు 6నెలల కుమార్తె కరోనా బారిన పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఇలాంటి సమయంలో ఆక్సిజన్‌ సదుపాయం కోసం వెతుకుతున్న వారికి.. చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు వెంటనే స్పందించి, చిన్నారికి ఆక్సిజన్, వైద్య సదుపాయాలు కల్పించారు. సమయానికి ఆక్సిజన్‌ అందించడంతో ఆ చిన్నారి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి కోలుకుంది. దీంతో ఆ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తమ బిడ్డ తమకు దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో స్పందించి, చిన్నారి ప్రాణాన్ని కాపాడడంతో చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌కు పైడిపర్రు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కరోనా కష్ట కాలంలో చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ చేపడుతున్న సేవా కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలు కొనియాడుతున్నారు.