అలయ్ బలయ్ – తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది : మెగాస్టార్

హైదరాబాద్ :  తెలంగాణలో దసరా పండుగను పురస్కరించుకుని, విజయదశమి తర్వాత రోజు బంధుమిత్రులను కలుసుకున్న సందర్భంగా పరస్పర ఆత్మీయాభిమానాలతో ఆలింగనం చేసుకుంటూ ‘అలయ్ బలయ్’ చెప్పుకుంటారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వానికి అద్దం పట్టేలా జరిగే ఈ కార్యక్రమాన్ని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ప్రతి ఏటా గ్రాండ్‌గా నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమానికి.. వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆయన ఆహ్వానిస్తుంటా రు.  ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్, మెగాస్టార్ చిరంజీవి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, బీజేపీ నేతలు రామ్ చందర్ రావు, కపిలవాయి దిలీప్ కుమార్, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, రామకృష్ణ, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగమయ్యేందుకు ఎప్పటి నుండో వేచి చూస్తున్నానంటూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చిరంజీవి.. డప్పుకొడుతూ అందరిలో హుషారును నింపారు, చిరంజీవి  మాట్లాడుతూ.. ‘‘అలయ్ బలయ్ కార్యక్రమానికి గుర్తింపు తెచ్చిన ఘనత దత్తాత్రేయగారికే దక్కుతుంది. 17 సంవత్సరాలుగా ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుండటం మాములు విషయం కాదు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం లో భాగమయ్యేందుకు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నాను. పవన్ కల్యాణ్ , అల్లు అరవింద్ ,వంటి వారి మాదిరిగా దత్తాత్రేయగారి దృష్టిలో ఎప్పుడు పడతానా? ఎప్పుడు నాకు ఆహ్వానం వస్తుందా? అని ఎదురుచూస్తున్నాను. ఇప్పుడొచ్చిందా ఆహ్వానం. అలయ్ బలయ్ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరగాలి. సినిమా ఇండస్ట్రీలో స్నేహపూర్వక వాతావరణం కోసం ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు వంటివారు ప్రయత్నించారు. ఆ సంప్రదాయాన్ని ప్రస్తుత తరం వారు కూడా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ అవకాశం నాకు కల్పించిన దత్తాత్రేయగారికి, వారి కుమార్తెకు.. అందరికీ ధన్యవాదాలు. అని అన్నారు.