ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన చిత్రయూనిట్!

ప్రభాస్ తన కెరియర్లో మొట్టమొదటి సారిగా ఒక పౌరాణిక చిత్రం చేస్తున్నాడు. రామాయణ ఇతివృత్తంతో ‘ఆది పురుష్’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. టి – సిరీస్ వారి వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటు అయోధ్య .. అటు లంకానగరం .. మధ్యలో కిష్కింధకి సంబంధించిన భారీ సెట్లు వేయించారు.

ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఒక భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించడం మొదలుపెట్టారు. ప్రభాస్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఆగస్టు 11వ తేదీన ఈ సినిమను విడుదల చేయనున్నట్టు చెప్పారు.

హిందీ .. తెలుగు .. తమిళ .. కన్నడ .. మలయాళ భాషల్లో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రాముడిగా ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాలో సీతగా కృతి సనన్ కనిపించనుంది. ఇక లక్ష్మణుడిగా సన్నీసింగ్ చేస్తుండగా, రావణుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్నాడు. తెలుగు తెరపై ఈ స్థాయి పౌరాణికం రాలేదని మేకర్స్ చెబుతూ ఉండటం, అందరిలో మరింత ఆత్రుతను పెంచుతోంది.