14,15 వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి-సర్పంచులు

కృష్ణాజిల్లా నందిగామ: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14 ,15వ ఆర్థిక సంఘం నిధులను తక్షణమే గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని పంచాయితీ సర్పంచులు, పాలకవర్గ సభ్యులు రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. చందర్లపాడు మండలం కోనయపాలెం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం పంచాయతీ పరిధిలోని గ్రామాల అభివృద్ధి కోసం విడుదల చేసిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సర్పంచులు మార్కం పూడి వెంకట్రావమ్మ, మామూళ్ళ వాంకేశ్వరావు, కుసుమ రాజు వీరమ్మ, కోనయ్యపాలెం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు బుధవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు వాసిరెడ్డి ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు కల్పన దీక్షా శిబిరానికి చేరుకొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14,15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు అని అన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల అభివృద్ధికి ఉపయోగపడాలి అన్నారు. గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ కన్నకలలు నిజం చేయాలంటే గ్రామాల అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14 ,15వ ఆర్థిక సంఘం నిధులను తక్షణమే రాష్ట్రప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసి గ్రామాల అభివృద్ధి కొరకు చేయూత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు పాల్గొన్నారు.